ప్రతిష్ఠాత్మకమైన జీ 20 శిఖరాగ్ర సదస్సుకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 9, 10 వ తేదీల్లో జరిగే ఈ జీ 20 దేశాధినేతల సదస్సుకు 20 దేశాల అధినేతలు, ఇతర ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశం జరిగే ప్రగతి మైదాన్‌లోని కాంప్లెక్స్ సహా భారత్‌కు వచ్చిన అతిథులు ఉండేలా హోటళ్లు, వసతి సదుపాయాలు ఇలా అన్నీ సిద్ధం చేశారు. ఇక ఢిల్లీ వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా అణువణువునా సీసీటీవీ కెమెరాలతో 24X7 నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోని ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో 3 రోజుల పాటు పలు కఠిన ఆంక్షలు విధించారు.
ఇందులో భాగంగానే ఆన్‌లైన్ డెలివరీ, క్లౌడ్ కిచెన్‌లను ఈనెల 8 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఢిల్లీలో పూర్తిగా బంద్ చేయనున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో సేవలపై పూర్తిగా నిషేధం విధించారు. ఇక ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థల డెలివరీలను కూడా పూర్తిగా బంద్ చేశారు. ఢిల్లీలోని ఎన్‌డీఎమ్‌సీ ప్రాంతంలో డెలివరీ సేవలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఈ నెల 7 వ తేదీ అర్ధరాత్రి నుంచి 10 వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అదే విధంగా ఈ నెల 7 వ తేది అర్ధరాత్రి నుంచి 10 వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వచ్చే వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్‌ఎస్ యాదవ్ వెల్లడించారు.
మరోవైపు ఈ జీ 20 సదస్సు నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వ తేదీ వరకు పబ్లిక్ హాలిడేను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ నెల 9, 10 వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవును కూడా ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు ఆయా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీ 20 సమావేశాలకు సంబంధించి అతిథులు, అధికారులు ప్రయాణించే ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.