ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా, భారత్‌ పేర్లపై దేశవ్యాప్తంగా చర్చ,,,అసలు రాజ్యాంగంలో ఏం ఉంది

national |  Suryaa Desk  | Published : Tue, Sep 05, 2023, 09:59 PM

భారత్, ఇండియా ఈ రెండింట్లో మన దేశం పేరు ఏంటి అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇండియా అని అన్ని సర్టిఫికేట్లు, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, అన్ని అధికారిక పత్రాల్లోనూ రాసుకుంటూ.. పిలుచుకోవడం మాత్రం భారత్ అని సంబోధిస్తున్నాం. అయితే ఇన్ని రోజులు అడపాదడపా ఇండియా అనే పేరు స్థానంలో భారత్ అని మార్చాలని డిమాండ్లు, కోర్టుల్లో పిటిషన్లు దాఖలైనా వాటికి అంతగా ప్రాధాన్యం రాలేదు. దీంతో ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. తాజాగా జీ 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దేశాధినేతలకు పంపించిన విందు ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రచురించడంతో ఈ అంశం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే గతంలో ఎన్నోసార్లు ఇండియా పేరును భారత్‌గా మార్చాలని సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు వేసినప్పటికీ.. వాటిని కోర్టు కొట్టివేసింది.


అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 ప్రకారం.. ‘ఇండియా, ఇది భారత్‌; రాష్ట్రాల సమాఖ్య’ అని స్పష్టంగా రాసి ఉంది. దీని ప్రకారం మన దేశం పేరు ‘ఇండియా’ లేదా ‘భారత్‌’ ఇందులో ఏదైనా అధికారిక పేర్లుగానే గుర్తించాలి. అయితే అనధికారికంగా ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చని ఉంది. అయితే తాజాగా రాష్ట్రపతి ఇచ్చిన ఆహ్వాన లేఖలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని మాత్రమే పేర్కొనడంతో.. ఇండియా పేరును భారత్‌గా మార్చనున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన నిరంజన్‌ భత్వాల్‌ అనే వ్యక్తి ఇండియా పేరును భారత్‌గా మార్చాలని గతంలో పలుమార్లు సుప్రీం కోర్టుకు ఎక్కాడు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో కేంద్రం అభిప్రాయాన్ని కూడా కోరింది. దీనికి కేంద్ర ప్రభుత్వం 2015 నవంబర్‌లో వివరణ ఇచ్చింది. అందులో ఇండియాకు బదులు భారత్‌ అని పిలవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టుకు తెలిపింది.


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో మార్పులు చేయాల్సిన పరిస్థితులు లేవని ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే ఇండియా, భారత్ అనే పేర్లకు సంబంధించి అనేక అంశాలను రాజ్యాంగ సభ విస్తృతంగా చర్చించిందని తెలిపింది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఆర్టికల్‌ 1లోని నిబంధనలు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పష్టం చేసింది. దీంతో ఇండియా లేదా భారత్‌.. రెండింటిలో తమకు నచ్చినదాన్ని పిలుచుకోవచ్చని 2016 మార్చి 11 వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది.


అయితే ఆ తర్వాత 2020 జూన్‌లోనూ సుప్రీంకోర్టులో ఓ రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ఇండియా అనే పదం వలస వాదులైన బ్రిటీష్ వారు ఇచ్చిందని.. ఆ పేరు బానిసత్వానికి చిహ్నంగా ఉందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. అందుకే ఆర్టికల్‌ 1ను సవరించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించాలని కోరారు. అయితే ఆ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు.. రాజ్యాంగంలో ఇండియా, భారత్‌ అనే రెండు పేర్లు ఉన్నాయని అప్పటి చీఫ్ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టం చేశారు. ఇదే పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవచ్చని పిటిషనర్‌కు సూచించారు. అయితే ఇప్పుడు ఇండియా స్థానంలో భారత్‌ అనే పేరును పెట్టాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆర్టికల్‌ 1కు సవరణ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని సాధారణ మెజార్టీ అయిన మొత్తం సభ్యుల్లో 50 శాతం కంటే ఎక్కువ మందితో ఆమోదం పొందించాల్సి ఉంటుంది. అయితే ఆర్టికల్‌ 1ను సవరించాలంటే మాత్రం ప్రత్యేక మెజార్టీ అయిన మూడింట రెండొంతుల మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్‌ 18 నుంచి 22వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో.. ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com