దక్షిణ చైనా, హాంకాంగ్‌లను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జల ప్రళయం వచ్చిందా అన్న రేంజ్‌లో హాంకాంగ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదకు హాంకాంగ్ మహా నగరం జల దిగ్భందంలో చిక్కుకుంది. ఒకే ఒక్క గంటలో కురిసిన వర్షం మొత్తం నగరాన్నే నీట ముంచేసింది. శుక్రవారం ఉదయం హాంకాంగ్ నగరంలోని వీధులు, సబ్‌వేలు మునిగిపోయాయి. దీంతో అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. గత 140 ఏళ్లలో హాంకాంగ్ నగరంలో ఈ స్థాయి కుంభవృష్టి పడలేదని స్థానిక వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వరద ముంపులో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సైన్యం, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
హాంకాంగ్‌లో కురిసిన ఈ భారీ వర్షాల కారణంగా ఒకరు చనిపోగా.. ఒకే రోజులో 83 మంది ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు తెలిపారు. దాదాపు 75 లక్షల మంది నివసించే హాంకాంగ్ నగరంలో గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 లోపు 158.1 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు హాంకాంగ్ వాతావరణ శాఖ వెల్లడించింది. 1884 తర్వాత ఒక గంటలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని తెలిపింది. క్వోలూన్, నగర ఉత్తర ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి లోపు 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడినట్లు పేర్కొంది. నగరంలోని కొన్ని చోట్ల గత 24 గంటల్లో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని.. ఇటీవలే అత్యంత బలమైన టైఫూన్ బారి నుంచి కోలుకుంటున్న హాంకాంగ్ నగరాన్ని తాజా వరదలు మరింత దెబ్బకొట్టాయని అధికారులు చెప్పారు.
గురువారం రాత్రి కురిసిన విపరీతమైన వర్షానికి శుక్రవారం వరద పోటెత్తి.. చాలా చోట్ల జనజీవనం స్తంభించింది. రవాణా, వ్యాపారాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హాంకాంగ్‌లో అత్యంత తీవ్రమైన వర్షపాత హెచ్చరిక అయిన బ్లాక్‌ను గురువారం సాయంత్రమే జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను నిలిపివేసింది. ఎమర్జెన్సీ ఉద్యోగులు మాత్రమే ఆఫీస్‌లకు రావాలని.. మిగితా వారు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాంగ్‌తాయ్‌లోని ఓ రైల్వే స్టేషన్ పూర్తిగా నీట మునగడంతో అధికారులు రైళ్లను నిలిపివేశారు. బస్సులు కూడా బంద్ అయ్యాయి.
అటు.. దక్షిణ చైనాలోని షెన్‌జెన్ నగరంలో కూడా భారీ వర్షాలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 1952 తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో వందల విమాన సర్వీసులను రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. చైనాలోని దక్షిణ భాగంలో జన సాంద్రత అత్యధికంగా ఉంటుంది.