ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ పేరు మార్పు వార్తలతో తెరపైకి మరో వాదన,,,ఇండియా పేరు కోసం పాక్ ఆరాటం

international |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 11:05 PM

ఇండియా పేరు భారత్‌గా మారనుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న వేళ.. తెరపైకి మరిన్ని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇండియా అనే పేరును ఐక్యరాజ్యసమితి ముందు భారత్ వదులుకుంటా ఆ పేరును తీసుకునేందుకు పాకిస్థాన్ ఆశ పడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌లో ఉన్న లోకల్ ఛానెళ్లలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన గానీ.. సూచనలు గానీ చేయకపోవడంతో అసలు ఈ పేరు మార్పు ఉంటుందా అనే వాదన వినిపిస్తోంది. ఇంతలోనే పాక్ ఇలా ఆశపడటం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


అయితే ఇండియా పేరును ఐక్యరాజ్యసమితి సమక్షంలో భారత్‌గా నామకరణం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడితే తమ దేశానికి ఇండియా అని పేరును పాకిస్తాన్ పెట్టుకోవచ్చని పాక్ స్థానిక మీడియా తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే చాలా కాలంగా పాకిస్తాన్‌లో ఉన్న జాతీయవాదులు ఇండియా అనేది తమ ప్రాంతానికి చెందినదే అనే వాదనలు వినిపిస్తున్నాయి. సింధు ప్రాంతం పేరు నుంచి ఇండియా అనే పేరు వచ్చిందని.. దేశం విడిపోకముందు ఇండియా అనే పేరు ఉందని.. స్వాతంత్య్రం సమయంలో భారత్, పాక్ విడిపోవడంతో.. ఇండియా పేరు మీద తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయని చెబుతూ ఉంటారు. తాజాగా ఇండియా పేరను భారత్‍‌‌గా మారుస్తున్నారన్న ఊహాగానాలు వెలువడటంతో తమ దేశానికి ఆ పేరును పెట్టుకోవాలని పాక్ చూస్తోందనే వాదనలు బయటికి వస్తున్నాయి. దీనికి సంబంధించి సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ట్విటర్‌ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.


ఇక ఈ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇండియా పేరును పాకిస్తాన్ పెట్టుకుంటే.. పాకిస్థాన్ పేరును ఆఫ్ఘనిస్తాన్ పెట్టుకుంటుందని.. అపుడు ఆఫ్ఘనిస్తాన్ పేరును రష్యా పెట్టుకోవచ్చంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం పాకిస్తాన్ పేరు మార్చుకుని ఇండియా అని పెట్టుకున్నా ఆ దేశం తలరాత, బుద్ధి మాత్రం మారదు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా స్పందించారు. అక్కడ గ్రామమే లేదు అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయారయ్యారని తన స్టైల్‌లో పోస్ట్ చేశారు.


అయితే పేరు మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా గత కొన్ని రోజులుగా ఈ వార్తలు మీడియా, సోషల్ మీడియాలో గుప్పు మంటున్నాయి. అయితే దీనికి ఓ కారణం లేకపోలేదు. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులకు పంపించిన ప్రత్యేక డిన్నర్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం ప్రచురించింది. దీంతో ఇండియా పేరును భారత్ అని మార్చుతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రోజే ప్రధాని ఇండోనేషియా పర్యటన సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అంటూ ప్రకటన విడుదల కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com