‘ఇది ఐన్‌స్టీన్ బ్రెయిన్.. దీన్ని మీరు కొనుక్కుంటే మీ మెదడు సామర్థ్యం పెరిగి.. తెలివైన వారు అవుతారు.. ఇది చాలా చౌక కూడా..!’ అంటూ చైనాకు చెందిన ఓ కంపెనీ ఉత్పత్తి ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఉత్పత్తిని కొనుగోలు చేస్తే.. మీరు కూడా ఐన్‌స్టీన్ అంతటి చురుకైనవారిగా మారిపోతారని ప్రచారం చేస్తోంది. అంతేకాదు, ఇదేదో చిప్ లేదా మెడిసిన్ కాదని, ఓ వర్చువల్ ప్రొడక్ట్ అని ఆ సంస్థ చెబుతోంది. కంపెనీ ప్రచారానికి ఆకర్షితులైన జనం.. దానిని కొనేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే 20 వేల మంది దీనిని కొనుగోలు చేయడం చెప్పుకోదగ్గ విషయం.
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని టవోబావో ఆన్‌లైన్ స్టోర్ ఇచ్చిన ప్రకటన ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఓ ప్రొడక్ట్‌ను విక్రయానికి ఉంచిన ఈ సంస్థ.. ఒక్కో యూనిట్ ధర 0.1 నుంచి ఒక యువాన్ వరకు నిర్ణయించింది. (అంటే మన కరెన్సీలో రూ.1 నుంచి రూ.12 మాత్రమే). ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఫోటోతో ‘ఐన్‌స్టీన్ బ్రెయిన్’ అంటూ అమ్మకానికి ఉంచి ఈ ప్రొడక్ట్‌ను ఇప్పటికే 20వేల మంది కొనుగోలు చేశారు. అయితే ఇది చిప్ లేదా మెడిసిన్ కాదని భౌతికంగా కన్పించదని ఆ ప్రకటనలో పేర్కొంది.
‘మా ప్రొడక్ట్ వర్చువల్.. దీని కోసం డబ్బులు చెల్లించిన తర్వాత.. స్మార్ట్ అవడం కోసం మీరు ఎదురుచూడాల్సి ఉంటుంది.. సాధారణంగా ఒక రాత్రి తర్వాతి నుంచే మీ తలలో ఐన్‌స్టీన్ బ్రెయిన్ వృద్ధి చెందడాన్ని మీరు గమనిస్తారు’ అని ఆ ప్రకటనలో వివరించింది. ఇప్పటికే ఈ ప్రొడక్ట్ కోసం స్థానికంగా డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. కొంతమంది దీని గురించ సానుకూలంగా రివ్యూలు కూడా ఇవ్వడం గమనార్హం.
‘ఇది చాలా సమర్థంగా పనిచేస్తోంది.. నా మెదడు సామర్థ్యాల్లో మార్పును నేను గుర్తించాను.. ఈ ఉత్పత్తిని కొనుగోలు చేసిన తర్వాత నేనో పరీక్ష రాశాను. అందులో అన్ని ప్రశ్నలను పూర్తి చేశాను’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరికొందరు మాత్రం.. ఇదో సిల్లీ ప్రొడక్ట్ అని, కేవలం ప్రచారం కోసమే ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇది కొన్న తర్వాత నేను వెర్రివాడినని గ్రహించానని ఒకరు.. నేను నియంత్రిత న్యూక్లియర్ ఫ్యూజన్ సిద్ధాంతాన్ని పరిశోధిస్తున్నానని ప్రకటించినందుకు సంతోషిస్తున్నానని ఇంకొకరు వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు.
దీనిపై ఛాంగ్‌క్వింగ్‌కు చెందిన ఓ మానసిక నిపుణుడు మాట్లాడుతూ.. ‘‘మనం ఐన్‌స్టీన్ అంతటి తెలివైనవారమని నమ్మితే.. మనలో తెలియకుండానే విశ్వాసం పెరుగుతుంది.. అప్పుడు ఫలితాలు కూడా సానుకూలంగా ఉంటాయి. .అలా నమ్మినప్పుడే పరీక్షలు బాగా రాయగలం.. మంచి మార్కులు వస్తాయి. ఇది నిజమా? కాదా? అన్నది పక్కనబెడితే.. తక్కువ ఖర్చులో మన విశ్వాసాన్ని పెంచుకునే మార్గంగా భావించొచ్చు’’ అని అన్నారు. ‘ఇదేమంత ఖరీదైంది కాదు.. కానీ ఆనందం, సంతృప్తినిస్తుంది. ఉరుకుల పరుగుల సమాజంలో ఈ రకమైన సరళమైన, తక్కువ ఖర్చుతో కూడిన భావోద్వేగ అనుభవం విశ్రాంతి, వినోదం కోసం ఒక మార్గంగా మారింది’ అని వ్యాఖ్యానించారు. చైనా వ్యాపార దిగ్గజం అలీబాబాకు చెందిన టవోబావో.. దేశంలో ప్రముఖ షాపింగ్ వెబ్‌సైట్లలో ఒకటి. అంతర్జాతీయంగా 2021లో అత్యంత ఎక్కువ మంది వీక్షించిన వెబ్‌సైట్ల జాబితాలో ఇది ఎనిమిదో స్థానంలో నిలిచింది. అలాంటి వేదికలో ఈ యాడ్ కన్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.