కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలో ఈనెల 12వ తేదీ నుంచి శ్రీపాద శ్రీవల్లభ జయంతి సప్తాహ మహోత్సవాలు జరగనున్నాయి. వారం రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా విశేషపూజలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాలు నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. వీరికి ఎటువంటి ఆసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ, అధికారుల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ప్రతి రోజు ఉదయం 8 గంటలకు మహాగణపతి పూజ, శ్రీపాద శ్రీవల్లభుల వారి మహిమాన్విత దివ్య పాదపద్మములకు మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం, శ్రీసూక్త పురుషసూక్తములతో సహస్ర నామార్చన, మంగళహారతి, మంత్రపుష్పము, వేదపారాయణం, రుత్విక్కులచే దత్త మూలమంత్ర అనుష్టానము, గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్ పారాయణ, గురుచరిత్ర, శ్రీపాదశ్రీవల్లభ చరిత్ర పారాయణం జరుగుతాయి. సాయంత్రం 4గంటలకు అగ్ని ప్రతిష్టాపన, దత్తమంత్ర హోమం, 5గంటలకు శ్రీపాదశ్రీవల్లభుల వారి దివ్వ పాదపద్మములకు వివిధ హారతులు, స్వామికి పల్లకిసేవ, సాయంకాలార్చన, మంగళ హారతి నిర్వహిస్తారు.