బి.ఎస్.వి హిమబిందు ఇప్పుడు ఏసీబీ కోర్టుకు III అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి-కమ్-జడ్జిగా ఉన్నారు. ఆమె పూర్తి పేరు జస్టిస్ బొక్కా సత్య వెంకట హిమ బిందు. 2016లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారు. అంతకు ముందు ఆమె ఏసీబీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18న, అంటే 2023న, సీబీఐ నిర్వహించే అంశాలకు సంబంధించి ఆమెకు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి పదవిని ఇచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై తీర్పు వెలువరించిన జస్టిస్ హిమ బిందు అందరి దృష్టినీ ఆకర్షించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్. ఈ కేసులో రూ 371 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా హవాలా రూపంలో చేతులు మారాయని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. దీనికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ క్రియ అంతా ఏపీ టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడని తేల్చింది. ఆపై కేసు నమోదు చేసింది. మొత్తం 38 మందిని ముద్దాయిలుగా చేర్చింది. కానీ ప్రధానంగా కుట్రదారు మాత్రం చంద్రబాబేనని స్పష్టం చేసింది. 2021లో దీనికి సంబంధించి కేసు నమోదైంది. మహారాష్ట్ర లోని పూణే జీఎస్టీ డబ్బుల విషయంపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో తీగ లాగితే డొంకంతా కదలింది. సీబీఐ కేసు నమోదు చేయడం, సీఐడీ రంగంలోకి దిగడం చకచకా జరిగింది. మొత్తం 25 పేజీల రిమాండ్ రిపోర్టు తయారు చేసింది.
నంద్యాలలో ప్రచారంలో భాగంగా ఉన్న చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి నేరుగా కంచనపల్లి ఆఫీసుకు తీసుకు వచ్చింది. 10 గంటల పాటు విచారించింది. చంద్రబాబు నాయుడు ముందు 20 ప్రశ్నలు సంధించింది. కానీ ఆయన ఏ ఒక్క దానికీ సమాధానం చెప్పకుండా దాట వేశారు. తనను మీరెవరు ప్రశ్నించేందుకుని దుర్భాషలాడారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్సలు చేయించి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏపీ సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదించారు. ఇక చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టులో పేరు పొందిన సిద్దార్థ్ లూథ్రాతో పాటు వెంకటేశ్వర్ రావు వాదనలు వినిపించారు.
ఆరున్నర గంటలకు పైగా ఇరువురి వాదనలు కొనసాగాయి. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. ఎలాంటి తీర్పు వెలువరిస్తారేమోనని. 409 కింద కేసు చెల్లదని, ఆయన మాజీ సీఎం అని, వెంటనే బెయిల్ ఇవ్వాలంటూ వాదించారు. అన్నింటినీ సావధానంగా విన్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉన్న బీఎస్వీ హిమ బిందు . ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. కానీ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పట్టించారు తన తీర్పుతో. ఏపీ సీఐడీ సమర్పించిన ఆధారాలతో తాను ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు జడ్జి. 14 రోజుల పాటు రిమాండ్ కు ఆదేశించారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు తుది తీర్పు వెలువరించే సమయంలో. చట్టం అందరికీ సమానమేనని, ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు. కేసును కేసు పరంగానే చూడాలి తప్పా సీఎం పదవిలో గతంలో పని చేశారా లేక రాజకీయ అనుభవం కలిగిన వారా , ప్రభావితం కలిగిన నాయకుడా అని చూడలేమని స్పష్టం చేశారు. మాజీ సీఎం అయినా సామాన్యుడైనా చట్టం అందరికీ సమానంగానే ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. గతంలో ఎన్నో సంచలన తీర్పులు వెలువరించిన బీఎస్వీ హిమ బిందు ఒక్కసారిగా దేశమంతటా తన వైపు తిప్పుకునేలా చేశారు. మొత్తంగా ఎంతో అనుభవం కలిగిన సుప్రీం లాయర్ లూథ్రాను సైతం విస్తు పోయేలా చేసింది జడ్జి.