కర్నూలు జిల్లా కోసిగి పోలీసులకు వింత సమస్య వచ్చి పడింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పండుగ రోజు ఇదేంటి బాబోయ్ అంటూ తలలు పట్టుకున్నారు. ఓ వ్యక్తి కోసిగి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తన పేరు లక్ష్మి నరసింహస్వామి అని.. తాను దేవుడిని అని స్టేషన్లో పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఏపీ బ్యాంకులలో ఉన్న డబ్బులు అన్ని తనవేనని.. ఎవరో ఆ డబ్బును మొత్తం దొంగతనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తనను ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కోసిగి పోలీస్ స్టేషన్ అధికారులు తలలు పట్టుకున్నారు. పండగ రోజు ఇదేం గోల అనుకున్నారు.. ఆ వ్యక్తికి సర్థిచెప్పి అక్కడి నుంచి పంపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఫిర్యాదు చేసిన వ్యక్తి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇలా విచిత్రంగా ఓ వ్యక్తి తాను దేవుడిని అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఈ విచిత్రమైన ఫిర్యాదు దెబ్బకు పోలీసులు అవాక్కయ్యారు.