విజయదశమి వేళ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై చేపట్టున్న ఏర్పాట్లపై.. అధికారులు, పాలక మండలి సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే.. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే.. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని కూడా సేవలకు వినియోగించుకోనున్నట్టు దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. అంతేకాకుండా.. ఆ 10 రోజల్లో విధులు నిర్వర్తించేందుకు ఒప్పంద ప్రాతిపదికన ఇంకొంత మంది సిబ్బందిని కూడా నియమించనున్నట్టు పేర్కొన్నారు. అయితే.. ఈ ఉత్సవాల వరకు అన్నదాన భవనాన్ని పూర్తి చేస్తామని రాంబాబు తెలిపారు.
అయితే.. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శన మివ్వనున్నారు. ఏఏ రోజు ఏ అలంకారణలో దర్శనమివ్వనున్నారన్నది కూడా వివరించారు. అక్టోబర్ 15న బాలా త్రిపురసుందరిగా, 16న గాయత్రీ దేవిగా, 17న అన్నపూర్ణ దేవిగా, 18న మహాలక్ష్మిగా, 19న మహాచండీగా, 20న సరస్వతి దేవిగా, 21న లలితా త్రిపుర సుందరిగా, 22న దుర్గాదేవిగా, 23న మహిషాసుర మర్దినిగా.. అదే రోజు మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమివ్వనున్నట్టు పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయని ఈవో భ్రమరాంబ చెప్పుకొచ్చారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా భక్తుల కోసం ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కేశ ఖండన కోసం 600 మంది సిబ్బంది ఉంటారని తెలిపారు. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నట్టు తెలిపాపు. భక్తుల స్నానాల కోసం షవర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ప్రసాదం కోసం కూడా 10 కౌంటర్లు ఉంటాయన్నారు. అవే కాకుండా.. మోడల్ గెస్ట్‌హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్‌ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీవీఐపీల దర్శనానికి స్లాట్లు కూడా నిర్ణయిస్తామన్న ఈవీ.. దసరా ఉత్సవాలు జరిగిన 9 రోజుల పాటు అంతరాలయ దర్శనం ఉండదని చెప్పుకొచ్చారు.