ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుండి పరిపాలన ప్రారంభంపై క్లారిటీ ఇచ్చారు. విజయదశమి కి విశాఖ నుండి సీఎం కార్యాలయం పాలన ప్రారంభమవుతుందన్నారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు చేయనున్నారు. అలాగే ముందస్తు, జమిలి ఎన్నికలు పై కేంద్రం నిర్ణయం ప్రకారం ముందుకి వెళతామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు.
ఈ సమావేశంలో పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని.. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి జగన్. రిటైరైన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలకు ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలన్నారు. రిటైరైన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌మెంట్ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు సీఎం.
ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ చేశారు. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్.. ప్రైవేట్ యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా ఈ చర్యలు ఉంటాయి. ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుందన్నారు.. ఇంతకు ముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీలతో టై అప్ ఉండేలా చట్ట సవరణ చేశారు. దీనివల్ల జాయింట్ సర్టిఫికేషన్ ఉంటుందన్నారు. ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి అన్నారు. దీని వల్ల పిల్లలకు మేలు జరుగుతుందన్నారు.
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పధకం ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది చేకూరనుంది. యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన వారికి 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం తదితర అంశాలపై చర్చించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల కు జిపిఎస్ అమలు ముసాయిదా బిల్లులకు ఓకే చెప్పారు. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు.. జగనన్న ఆరోగ్య సురక్షపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కురుపాం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఓకే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లు.. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు.. దేవాదాయ చట్ట సవరణను ఆమోదించారు. అలాగే మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.