తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. అమాయకుల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వర్క్ ఫ్రం హోమ్ పేరుతో ఓ యువతిని బురిడీ కొట్టించారు. ఆమె నిజమని నమ్మి వారికి డబ్బులు పంపించింది. తీరా మోసపోయానని తెలిసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయనగరంలో ఈ మోసం జరిగింది. పట్టణానికి చెందిన ఎంబీఏ పూర్తిచేసిన ఓ విద్యార్థిని జాబ్ వేటలో ఉంది. ఈ క్రమంలో ఆమె మొబైల్‌కు ఇటీవల మెసేజ్ వచ్చింది. వర్క్ ఫ్రం హోం అని.. ఇంటి దగ్గరే ఉంటూ డబ్బులు సంపాదించవచ్చునని మెసేజ్‌లో ప్రస్తావించారు. ఆమె మెసేజ్‌లో వచ్చిన ఆ లింకు ఓపెన్ చేయగా.. అవతలి వ్యక్తులు ఇచ్చిన టాస్క్‌కు యువతి సమాధానం చెప్పింది. అప్పుడు వాళ్లు డబ్బుల్ని ఆశ చూపించారు. ముందు కొంత డబ్బులు చెల్లిస్తే మరింత ఆదాయం వస్తుందని నమ్మించారు.
ఆమె అమాయకంగా నిజమని నమ్మి పలు విడతల్లో రూ.5 లక్షల వరకు వారికి పంపించింది. అనంతరం ఆ కేటుగాళ్లు ఆమె వాట్సాప్ నంబరును బ్లాక్ చేసేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నుంచే పనిచేయొచ్చని చెప్పి.. నెలకు రూ.లక్షల్లో సంపాదించవచ్చని చెప్పంతో నిజమని నమ్మానని ఆమె పోలీసులకు చెప్పారు. గతంలో లక్కీ డిప్, కేవైసీ, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం అప్డేట్ పేరుతో మోసం చేశారు. ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరగడంతో పోలీసులు పదే, పదే హెచ్చరిస్తున్నారు. అయినా సరే కొందరు అమాయకంగా ఇలా మోసపోతున్నారు.