తిరుమల నడక మార్గంలో మరోసారి ఎలుగుబంటి ప్రత్యక్షం అయ్యింది. అలిపిరి మెట్ల మార్గంలో నరసింహస్వామి ఆలయం దగ్గర ఫుట్ పాత్‌పై ఎలుగుబంటి కనిపించింది. మంగళవారం రాత్రి ఎలుగు సంచారాన్ని నడక మార్గంలోని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన ఎలుగు బంటి చాలా సేపు నడక మార్గంలోనే తిష్ట వేసింది. టీటీడీ రాత్రి 10 గంటల తర్వాత నడక మార్గంలోకి భక్తుల్ని అనుమతించడం లేదు. ఆ సమయంలో భక్తులు అటువైపు రాకపోవంతో పెద్ద ప్రమాదమే తప్పిపోయిందని చెప్పాలి.
మరోవైపు అలిపిరి నడక మార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుతను పట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఆరు చిరుతల్ని అటవీశాఖ అధికారులు బంధించారు.. వాటిని తిరుపతిలోని జూకు తరలించారు. అయితే వీటిలో మూడిటిని మాత్రం అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇంకా చిరుతల సంచారం ఉందనే అనుమానంతో అటవీశాఖ అధికారులు కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. చిరుతల సంచారాన్ని గమనిస్తున్నారు.
తాజాగా చిరుత చిక్కిన ప్రాంతానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెళ్లారు. టీటీడీ, అటవీశాఖ చిన్నారి లక్షితపై దాడి తర్వాత ఎన్నో చర్యలు తీసుకుంది అన్నారు. టీటీడీ నడకదారి భక్తులకు భద్రత కట్టుదిట్టం చేశారని.. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సూచనలు అన్ని అమలు చేస్తున్నామమన్నారు. నడకదారిలో భక్తులకు భక్తులకు కర్రలు అందించామని.. భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తామన్నారు. నడకదారిలో కంచె వెయ్యడమా.. జంతువుల సంచారానికి మార్గం సుగమం చెయ్యడానికి ఏర్పాటు చేస్తామన్నారు. విమర్శలు చేసే వారికి కనువిప్పు కలగాలని.. టీటీడీ తీసుకున్న చర్యల కారణంగానే ఆరు చిరుతను బంధించామమన్నారు. క్రూరమృగాల సంచారంపై నిరంతరం అధ్యయనం జరుగుతుందన్నారు.
అలిపిరి నడక మార్గంలో చిక్కిన ఆరవ చిరుత ను జూపార్క్ తరలించామన్నారు డీఎఫ్‌వో. జూపార్క్‌లో చిరుతకి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని.. దీని వయసు సుమారు నాలుగు సంవత్సరాల ఉంటుంది అన్నారు. వైద్య పరీక్షల అనంతరం చిరుతను సుదూర అటవీ ప్రాంతంలో వదలాలా, లేదా అన్నది నిర్ణయిస్తామన్నారు. బోన్‌లో చిక్కిన ఆరు చిరుతలలో రెండు మూడు చిరుతలకు దంతాలు సరిగా లేవన్నారు. వాటికి వేటాడే శక్తి తక్కువగా ఉంటుందని.. అలాంటి వాటిని జూపార్క్‌లో సంరక్షణ చేస్తామన్నారు. అంతేకాదు మరికొన్ని ప్రతిపాదనల్ని కూడా తెరపైకి తెచ్చారు. నడక మార్గాల్లో ఎలివేటెడ్ ఫుట్‌పాత్ (ఫుట్ ఓవర్ బ్రిడ్జి).. అలాగే జంతువులు అటూ ఇటూ తిరిగేలా యానిమల్ ఓవర్ పాస్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.