ఇటీవల విమానాల్లో జరుగుతున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన మరో ఘటన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విమానంలోని వాష్‌రూంకు వెళ్లిన ఓ 14 ఏళ్ల బాలికకు అవాక్కయ్యే ఘటన ఎదురైంది. ఆ టాయిలెట్లో ఐఫోన్ ఉండటాన్ని ఆ బాలిక పసిగట్టింది. దీంతో వెంటనే తన ఫోన్‌తో ఆ ఫోన్‌ను ఫోటో తీసి.. కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఈ విషయం బయటికి రావడంతో సదరు ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన ఆ ఎయిర్‌లైన్స్ విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే ఆ విమానంలో ఉన్న ఓ ఫ్లైట్ అటెండెంట్.. ఆ ఫోన్‌ను పెట్టినట్లు బాలిక, ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ సిబ్బందితోపాటు ఎఫ్‌బీఐ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలోని షార్లెట్ విమానాశ్రయం నుంచి బోస్టన్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న విమానంలో జరిగింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 1441.. షార్లెట్ నుంచి బోస్టన్‌కు బయల్దేరింది. అయితే ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ 14 ఏళ్ల బాలిక టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడ ఉన్న ఓ విమాన సిబ్బంది.. ఆ వాష్‌రూమ్‌లోకి కాకుండా ఫస్ట్ క్లాస్‌లో ఉన్న వాష్‌రూమ్ ఉపయోగించుకోవాలని సూచించాడు. దీంతో ఆ బాలిక అటు వైపు వెళ్లింది. ఇంతలో మళ్లీ అక్కడికి చేరుకున్న ఆ ఫ్లైట్ అటెండెంట్.. వాష్‌రూమ్‌లో చెత్త ఉందని తొలగించిన తర్వాత వెళ్లాలని చెప్పి.. ముందుగా ఆ వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు.
తర్వాత బయటికి వచ్చి బాలికను వెళ్లమని సూచించాడు. అయితే అందులోకి వెళ్లిన బాలిక.. టాయిలెట్ సీట్ వెనక భాగంలో ఐఫోన్ ఉండడాన్ని గుర్తించింది. ఆ ఐఫోన్‌ను ప్లాస్టర్‌తో టాయిలెట్ సీట్‌కు అతికించినట్లు గుర్తించింది. వెంటనే తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో ఆ టాయిలెట్ సీట్‌కు అతికించి ఉన్న ఐఫోన్‌ను ఫోటో తీసి విమానంలోకి వచ్చి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కూడా వెళ్లి ఆ టాయిలెట్లో అతికించి ఉన్న ఐఫోన్‌ను చూశారు. దీంతో ఆ ఫ్లైట్ అటెండెంటే కావాలని ఆ వాష్‌రూమ్‌లో ఐఫోన్‌ను ఉంచినట్లు వారు ఆరోపించారు. ఆ విమానం బోస్టన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్టు అధికారులు, పోలీసులు ఆ విమాన సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్‌బీఐ విచారణ జరుగుతోందని.. దానికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.