ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పేర్కొన్నారు. తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేసి తప్పుడు పనులు చేసినవారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని ఆయన అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఎచంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు రోడ్ల పైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారన్నారు. ఐటీ కంపెనీల సీఈవోలు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన తెలుపుతున్నారన్నారు. ఫైబర్ నెట్‌తో నెలకు రూ.35 కోట్ల చొప్పున 51 నెలల్లో రూ.1785 కోట్లు జగన్ వసూలు చేశారని ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తమ పార్టీ నేత నారా లోకేశ్ రూ.25వేల కోట్లను ఖర్చు చేసి సిమెంట్ రోడ్లు వేశారన్నారు. పంచాయతీరాజ్ శాఖలో గణనీయమైన అభివృద్ధిని చేసి చూపించిన యువనేతపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్‌ను, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.