చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియకు పలువురు నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయనను అదుపులోకి తీసుకున్న ప్రాంతంలో జగద్విఖ్యాతరెడ్డితో కలిసి ఆమె గురువారం దీక్షకు కూర్చున్నారు. అఖిల ఆమరణదీక్షకు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, పాణ్యం నాయకురాలు చరితారెడ్డి తదితరులు వచ్చి మద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అఖిలప్రియ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భూమా అఖిలప్రియ, జగద్విఖ్యాతరెడ్డిల నిరవధిక నిరాహార దీక్ష 24 గంటలు దాటింది. నిన్న సాయంత్రం వారు దీక్షకు కూర్చున్నారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వైద్యుడు డాక్టర్ నాగ సుమంత్ రెడ్డి తెలిపారు. షుగర్, బీపీ స్థాయులు తగ్గుతున్నట్లు తెలిపారు.