ఇండియా, కెనడాల మధ్య తలెత్తిన వివాదం అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. భారతీయ పౌరులు, విద్యార్థులు చాలా మంది కెనడాలో నివసిస్తుండగా.. తాజాగా వారికి ఖలిస్థానీ అనుకూల వాద సంస్థ అయిన సిఖ్స్ ఫర్ జస్టిస్ హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఉన్న హిందువులు వెంటనే ఇండియాకు వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగింది. ఈ మేరకు కెనడాలోని హిందువులకు ఒక అల్టిమేటం జారీ చేసింది.
ఖలిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ సిఖ్స్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్‌జే సంస్థపై 2019 లో భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలోనే ఖలిస్థాన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్న ఈ సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ కెనడాలో చాలా యాక్టివ్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ లీగల్ కౌన్సిల్ గుర్ పత్వంత్ సింగ్ పన్నున్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో కెనడాలో ఉంటున్న హిందువులు తక్షణమే భారత్ వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగాడు. ఖలిస్థాన్ ఉద్యమ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లండని సూచించాడు. ఈ హత్యపై భారత్ చేస్తున్న వాదనకు మద్దతుగా నిలిచేందుకు భారత సంతతికి చెందిన హిందువులు కెనడాను విడిచిపెట్టి వెళ్లాలని ఆ వీడియోలో వెల్లడించాడు.
భారత్‌కు మద్దతుగా నిలవడమే కాకుండా కెనడాలోని హిందువులు ఖలిస్థాన్ అనుకూల సిక్కుల భావ ప్రకటన వ్యక్తీకరణ అణచివేతకు కూడా మద్దతు తెలుపుతున్నారని గుర్ పత్వంత్ సింగ్ పన్నున్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. అయితే భారత్ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఈ గుర్ పత్వంత్ సింగ్ పన్నున్ కూడా ఉండటం గమనార్హం. అయితే కెనడాలోని హిందువులను భారత్ వెళ్లాలని గుర్ పత్వంత్ సింగ్ పన్నున్ విడుదల చేసిన వీడియోపై కెనడాలోని కెనడియన్ హిందూస్ ఫర్ హార్మనీ సంస్థ అధికార ప్రతినిధి విజయ్ జైన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఖలిస్థానీలు హిందూ ఫోబియాను కలిగి ఉండేవారని.. కానీ ఇప్పుడు దాన్ని కెనడా అంతటా పెద్ద ఎత్తున చూస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు.. భారత్, కెనడా దేశాల మధ్య ప్రస్తుతం తలెత్తిన వివాదంలోకి పాక్ చేరింది. ఖలిస్థానీ మద్దతు గ్రూపులతో పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు రహస్య భేటీ నిర్వహించినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ భేటీలో భారత్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత విస్తృతంగా వ్యాప్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.