అమెరికాలో 2024 లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే సంచలనం. ఆయన ఏది చేసినా.. ఏది మాట్లాడినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రైమరీ డిబేట్లకు మాత్రం తాను హాజరు కాబోనని తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చేసిన పని తెగ వైరల్‌గా మారింది. తాజాగా బుధవారం ఐవాలోని బెటెన్ డార్ప్‌లోని ఓ బార్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన అభిమానులకు డొనాల్డ్ ట్రంప్ పిజ్జాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత బిల్లులు, క్యాప్‌లు, టీ షర్టులపై తన సంతకం పెట్టి ట్రంప్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అయితే ఆ వీడియోలో పిజ్జాలు ఎవరికి కావాలంటూ ట్రంప్ ఉత్సాహంగా పాట పాడుతూ వారిలో కొత్త జోష్ నింపారు.
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 7 సార్లు డొనాల్డ్ ట్రంప్ ఐవాను సందర్శించారు. 2022 జులై నుంచి తన ఆఫీస్ నుంచి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం లేదు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున తాను పోటీలో ఉంటానని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు.
అయితే సెప్టెంబరు 20 వ తేదీన బుధవారం ఉదయం 8.25 గంటలకు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర సంచలనంగా మారింది. అందులో తన తండ్రి చనిపోయాడని చెప్పడానికి తాను చాలా చింతిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పేర్కొనడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ క్రమంలోనే తన తండ్రి స్థానంలో వచ్చే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అదే ట్విటర్ అకౌంట్‌లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను తిడుతూ మరిన్ని పోస్టులు పెట్టారు. ఆ తర్వాత వాటిని డిలీట్ చేశారు. అనంతరం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్.. పోస్టు పెట్టడంతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయిందని అంతా గుర్తించారు.