తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామి వారు గజ వాహనంపై దర్శనం ఇచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వాహనసేవలో స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్న జీయర్‌స్వామి, ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి దంపతులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ అశ్వర్థ నాయక్, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్ తదితరులు గజవాహన సేవలో పాల్గొన్నారు.
600 ఏళ్ల క్రితం మహవిష్ణువు అర్చకుడిని ఆవహించాడు. ‘శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఒక లోయ ఉంది... అందులో రహస్య గుహ ఒకటి ఉంది.. ఆ గుహలో ఉన్న విగ్రహాలను తెచ్చి ఉత్సవ మూర్తులుగా పూజా కైంకర్యాలు చేయండి’ అని నిర్దేశించారు. దీంతో అర్చకులు వెళ్ళి రహస్య గుహలోని ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. ఆ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. దీన్ని తమిళంలో ‘మలై కని వుండ్రు పెరుమాల్’ అని పిలుస్తారు. కొండ వంగిన లోయలో లభించిన విగ్రహాలు అని దీనికి అర్థం. అందుకే తిరుమల శ్రీవారిని మలయప్ప స్వామి అని కూడా పిలుస్తుంటారు. శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతోపాటు.. నిత్య, వార, పక్ష, వార్షిక ఉత్సవాలన్నీ ఈ మలయప్పస్వామి వార్లకే జరుగుతాయి.
గజవాహన సేవలో టీటీడీ అధికారులుగజ వాహనం.. కర్మ విముక్తి
ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును నిద్ర లేవగానే దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు.. ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు శ్రీవారు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవ రూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. మనలో ఉన్న అహంకారం తొలగిపోతే మనకు రక్షణగా భగవంతుడు ఉంటాడనే విషయాన్ని ఈ ఉత్సవం గుర్తు చేస్తుంది.