కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి పొట్టలో నట్లు, బోల్టులు, ఇయర్ ఫోన్స్ వంటి వస్తువులు చూసి వైద్యులు షాక్ అయ్యారు. దీంతో డాక్టర్లు మూడు గంటలు పాటు శ్రమించి, సర్జరీ చేసి వాటిని తొలగించారు. విస్తుగొలిపే ఈ ఘటన పంజాబ్‌లోని మోగాలో చోటుచేసుకుంది. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి గత రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అయితే, సాధారణమైన నొప్పిగానే భావించి.. పట్టించుకోలేదు. కానీ, గత రెండు రోజుల నుంచి నొప్పి మరింతగా వేధించడంతో.. అల్లాడిపోయాడు. కనీసం రాత్రిళ్లు నిద్ర కూడా పట్టేది కాదని కుటుంబసభ్యులు తెలిపారు.
దీనికి తోడు జ్వరం, వాంతులు కావడంతో కుటుంబసభ్యులు మోగాలోని మెడిసిటీ హాస్పిటల్‌కు తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు.. నొప్పి ఎందుకొస్తుందనే తెలుసుకోడానికి ఎక్స్‌రే, స్కానింగ్ చేశారు. రిపోర్టులు పరిశీలించగా కడుపులో పలు రకాలు వస్తువులు ఉన్నట్టు తెలిసి అవాక్కయ్యారు. వెంటనే అతడికి శస్త్రచికిత్స నిర్వహించి.. కడుపులోని ఇయర్ ఫోన్స్, బోల్టులు, నట్స్, లాక్, తాళాలు, వాషర్స్, వైర్లు, హెయిర్‌క్లిప్స్, బటన్స్, లాకెట్స్, రాఖీలు, జిప్పర్ ట్యాగ్, మార్బల్, సేఫ్టీ పిన్నులు వంటి తదితర 100 వస్తువులను బయటకు తీశారు.
అయితే, కుమారుడు ఆ వస్తువులను మింగిన విషయం తమకు ఎప్పుడూ తెలియలేదని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడని అతని తల్లి వెల్లడించారు. మెడిసిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కాల్రా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇలాంటి కేసు చూడటం ఇదే మొదటిసారిని పేర్కొన్నారు. గత రెండేళ్ల నుంచి అతడు కడుపునొప్పితో బాధపడుతున్నాడని చెప్పారు. చాలా మంది వైద్యులను సంప్రదించినా.. సమస్య ఏంటనేది నిర్దారించలేకపోయారని వివరించారు. చాలా రోజులుగా ఆ వస్తువులు బాధితుడి పొట్టలో ఉండటం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.