కోచింగ్ సెంటర్ నడుపుతోన్న ఓ ప్రయివేట్ ఉపాధ్యాయుడ్ని అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి బైక్ నుంచి ఓ తుపాకినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే, చివరకు బైక్‌లో ఆ తుపాకీని పెట్టింది పోలీసులేనని సీసీటీవీ కెమెరాల్లో బయటపడింది. అయినప్పటికీ పోలీసులు.. ఆ యువకుడ్ని వెంటనే విడిచిపెట్టలేదు. అతడి సోదరి ఐజీ ఆఫీసు ఎదుట రాత్రంతా బైఠాయించడంతో చివరకు 15 గంటల తర్వాత వదిలిపెట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది.
మీరట్ జిల్లా ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖండ్రవలి గ్రామానికి చెందిన బాధిత యువకుడు అంకిత్ త్యాగి కుటుంబానికి.. మరొకరితో చాలా కాలం నుంచి భూవివాదం కొనసాగుతోంది. పోలీసుల సాయంతో అవతలి వ్యక్తులు అంకిత్ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అంకిత్ నడుపుతోన్న కోచింగ్ సెంటర్ ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. అక్కడ ఉన్న అతడి బైక్‌లో తుపాకిని ఉంచి.. అనంతరం లోపలికి ప్రవేశించి అంకిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత బైక్‌లో తుపాకిని స్వాధీనం చేసుకుని.. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
దీంతో అంకిత్ సోదరి రాఖీ త్యాగి కొందరు మహిళలు వెళ్లి ఐజీ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి బైక్ సీటు కవరులో కావాలనే ఏదో ఉంచి, నిద్రపోతున్న అంకిత్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే పోలీసులే బైక్‌లో పిస్టల్‌ను పెట్టినట్లు గుర్తించామని తెలిపారు. తమ కుటుంబానికి వేరే కుటుంబంతో భూవివాదం నడుస్తోందని వారు వివరించారు.
ఆ కుటుంబంతో పోలీసులు కుమ్మక్కయ్యారని.. అందుకే అంకిత్‌ను ఇరికించేందుకు కుట్రచేశారని ఐజీకి ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రంతా అంకిత్ సోదరి తన చంటి బిడ్డతో కలిసి ఐజీ ఆఫీసు ముందు బైఠాయించింది. అనంతరం బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తనను కలవడానికి ఆమెను ఐజీ అనుమతించారు. సీసీటీవీ ఫుటేజీని ఐజీకి చూపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. మీరట్ గ్రామీణ ఎస్పీ కమలేశ్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. పోలీసుల వ్యవహరశైలి అనుమానాస్పదంగా ఉందని, దర్యాప్తు చేపట్టామని ఆయన తెలిపారు.