ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామానికి చెందిన నెరుసు శ్రీనివాసరావుకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు చెందిన కస్తూరికి ఈ ఏడాది జనవరిలో వివాహమైంది. శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలివెన్నులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కస్తూరి గృహిణి. ప్రస్తుతం అత్తింటిలో ఉంటోంది. భార్యా భర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి గొడవ జరగడంతో శుక్రవారం ఉదయం కస్తూరిని ఆమె స్వగ్రామం కొవ్వూరులో దించేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అనంతపల్లిలోని పోలవరం కుడి బ్రిడ్జి వద్దకు వచ్చే సమయానికి శ్రీనివాస్‌కు ఫోన్ రావడంతో బైక్ ఆపి మాట్లాడుతున్న తరుణంలో చెప్పు పడిపోయిందని తెచ్చుకుంటానని వెనక్కి వెళ్లి శ్రీనివాస్ కళ్ల ఎదుటే కాల్వలోకి దూకింది. కస్తూరి కాల్వలో కొట్టుకుపోతున్నా రక్షించేందుకు ఎవరూ సాహసించలేదు. 500 మీటర్ల దూరం వరకు నీళ్లపై కనిపించిన కస్తూరి తర్వాత నీటిలో మునిగిపోయింది. గజఈతగాళ్ల సహాయంతో వెదికినా ఆమె ఆచూకీ లభించలేదు. కాగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదుచేసి గాలిస్తున్నారు.