మోదీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సంయుక్త కిసాన్ మోర్చ, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు పాతబస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం బ్లాక్‌డే పాటిస్తూ కార్మిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లకీంపూర్, ఖేరి హత్యాకాండకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన లిఖితపూర్వక హామీలు నెరవేర్చాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి, మద్దతుదారుల గ్యారెంటీ చట్టం తేవాలి, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలి, నాలుగు లేబర్‌కోడ్లు రద్దు చేయాలని నినాదాలు చేశారు. రైతు ఉద్యమంలో అమరులైన వీరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, బద్దా వెంకట్రావు, పీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు రాజనాల రామ్మోహనరావు, డీఎన్‌వీఈ ప్రసాద్, కే.కృష్ణమాచార్యులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.