ఏలూరు రేంజ్ పరిధిలో ఖాళీగా ఉన్న సివిల్ ఎస్ఐ, ఏపీఎస్పీ, ఆర్ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాలను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి అందులో అర్హత పొందిన వారికి ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకూ ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఫిజికల్ పరీక్షలను నిర్వహించారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 14, 15 తేదీలలో ఏలూరులోనే మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల పరిస్థితిని తెలుసుకునేందుకు డీఐజీ స్వయంగా పరిశీలించారు. సీఆర్ఆర్ పాలిటెక్నిక్, ఉమెన్స్ కాలేజీ, డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజీ, సెయింట్ థెరిస్సా హైస్కూలు కేంద్రాలను పరిశీలించారు. డీఐజీతో పాటు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఉన్నారు.