మంగళవారం రాష్ట్ర బీజేపీ పార్టీ కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, టీడీపీ అధినేత నారా చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేసిన విధానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. దీనికి తోడు ఇటీవల పవన్ బీజేపీ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై సభలో వాడీ వేడి చర్చ జరిగింది. జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీలోని కొంతమంది నేతలు అధిష్ఠానంపై వత్తిడి తీసుకొచ్చారు. అంత తొందరెందుకు అని బీజేపీలోని మరికొంతమంది నేతలు వాదించారు. పవన్ వ్యాఖ్యలను, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్న వైనాన్ని అధిష్ఠానం గమనిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఇప్పటికే కేంద్రం వద్ద సమాచారం ఉందని పురంధేశ్వరి ఆ నేతలకు నచ్చచెప్పారు. ఎన్డీఏలో భాగస్వామ్యంతో ఉన్నందున తొందరపడి ఎవరూ మాట్లాడవద్దని బీజేపీ నేతలకు పురంధేశ్వరి సూచించారు. జనసేనతోనూ అడుగులు వేసే నిర్ణయంపై అధిష్ఠానానికే బీజేపీ కోర్ కమిటీ వదిలేసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ పార్టీ నేతలు ఫోకస్ పెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.