కేంద్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ పథకాలకు విడుదల చేసిన దాదాపు రూ.5వేల కోట్లను సీఎం జగన దుర్వినియోగం చేశారని, ఈ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట త్వరలో భిక్షాటన చేస్తామని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ తెలిపారు. మంగళవారం అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి రాగానే ఎస్సీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలను రద్దు చేసిందని, ఎస్సీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు తీవ్రమయ్యాయని మండిపడ్డారు. వైసీపీ అరాచకాన్ని నిలువరించేందుకు పోరాటాలు చేసేలా బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి రూట్‌మ్యాప్‌కు ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే ఎస్కేయూలో జాతీయ ఎస్సీ కమిషన సమావేశాన్ని నిర్వహించి.. సమస్యలపై నివేదికలు రూపొందిస్తారన్నారు. అనంతరం ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు శాంతకుమార్ ఆధ్వర్యంలో గుడిసె దేవానంద్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాకే శివశంకర్, నాయకులు ప్రభుకుమార్, ఓబీసీ మోర్చా నాగేంద్ర పాల్గొన్నారు.