ఈనెల 15 నుంచి 23 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదని... నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్ 19 గరుడ సేవ, 20 పుష్పక విమానం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. సెప్టెంబర్ మాసంలో 21.01 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. హుండీ ద్వారా 111 కోట్ల 65లక్షల ఆదాయం లభించిందని అన్నారు. కోటి 11 లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని.. 53.84లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేశామని చెప్పారు. అలాగే 8.94 లక్షల మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.