రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) ఎలైన్‌మెంట్‌లో అవకతవకలు, ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులతో పాటు అంగళ్లు ఘటనలో పోలీసులు నమోదుచేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి కె.సురేశ్‌రెడ్డి సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబు ఇప్పటికే రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో డీమ్డ్ కస్టడీగా పరిగణించి ఐఆర్‌ఆర్, అంగళ్లు ఘటనలో సాధారణ బెయిల్ మంజూరు చేయాలన్న చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదుల అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆయన డీమ్డ్ కస్టడీ నిర్వచనం పరిధిలోకిరారని పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్, అంగళ్లు ఘటన వ్యవహారంలో దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.