ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. దశాబ్దాల తరబడి సాగుతున్న ఘర్షణ చల్లబడి అక్కడ హిందువుల దైవం శ్రీరాముడి భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. శరవేగంగా జరుగుతున్న రామాలయ నిర్మాణం పనులు జనవరి నాటికి పూర్తయి.. ఆలయం ప్రారంభించనున్నట్లు ఇప్పటికే శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. దీంతో ఇప్పటికే శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్న అయోధ్య నగరం ఖ్యాతి దేశ, విదేశాలకు విస్తరించనుంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే మరో కొత్త పర్యాటక, ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. అలాంటి పవిత్ర స్థలంలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన పని తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అయోధ్యలోని సరయు నదిలో ఓ మహిళ రీల్ చేసి ప్రస్తుతం నెటిజన్ల నుంచి తీవ్ర ట్రోల్స్, విమర్శలకు గురవుతోంది. సరయు నది సమీపంలో ఉన్న రామ్ కి పైడి ఘాట్‌ను హిందూ భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఎంతో మంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే అలాంటి పవిత్రమైన ప్రాంతంలో అభ్యంతరకరంగా డ్యాన్స్ చేయడాన్ని సహించలేక కొందరు ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీసులను కోరారు. ‘జీవన్ మే జానే జానా’ అనే పాటకు డ్యాన్స్ చేసింది. ఇక ఆ వీడియోను కాస్త ఫేమస్ అయ్యేందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడమేంటని తీవ్రంగా మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలతో అయోధ్య పోలీసులు స్పందించారు. అయోధ్య ఇన్‌స్పెక్టర్ ఆదేశాలతో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే గతంలోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితం సరయు నదిలో ఓ బాలిక డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన అయోధ్య పోలీసులు.. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు.