దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన 53 ఏళ్ల రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఇప్పటికీ ఎన్నోసార్లు చర్చలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా చాలా మంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని రాహుల్ గాంధీని అడుగుతూనే ఉంటారు. దేశంలోని కొంత మంది ప్రముఖులు, నటీమణులు కూడా రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటాం అంటూ ముందుకు వచ్చిన సంఘటనలు చూశాం. అయితే భారత్ జోడో యాత్ర తర్వాత పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ సామాన్యులతో కలిసి వారి మంచి చెడ్డలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ తాజాగా కాలేజ్ స్టూడెంట్స్‌తో ముచ్చటించారు. అయితే అక్కడ కూడా పెళ్లి గురించి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.
ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా జైపుర్‌లోని మహారాణి కళాశాల విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించారు. అయితే ఆ సమయంలో తీసిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం సహా వివిధ అంశాలపై ప్రారంభమైన చర్చ.. రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయాల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే తన ఇష్టాయిష్టాలతోపాటు వివిధ విషయాలను ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే ఓ యువతి లేచి.. మీరు చాలా అందంగా, స్మార్ట్‌గా ఉంటారు కదా.. ఎందుకు ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు అని ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. తన పనులు, పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమైనందునే పెళ్లి వైపు వెళ్లలేదని వెల్లడించారు. ఇక తాను ఇష్టపడే ఫుడ్ ఏంటని మరో యువతి అడగ్గా.. కాకరకాయ, బఠానీలు, బచ్చలికూర తప్ప మిగతావన్ని తింటానని తెలిపారు. ఇక ఇష్టమైన ప్రదేశాలు ఎక్కడ అని ఇంకో యువతి ప్రశ్నించగా.. తాను ఇప్పటివరకు చూడని ప్రదేశాలంటే ఇష్టమైన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను చూడాలని తాను కోరుకుంటానని తెలిపారు. ఇక తన ముఖానికి ఎప్పుడూ సబ్బు గానీ.. క్రీమ్స్ గానీ రుద్దలేదని.. కేవలం నీళ్లతోనే కడుక్కుంటానని వెల్లడించారు.
మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్రం గురించి మాట్లాడిన రాహుల్.. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు జరిగిన పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొన్నారని.. అలాంటప్పుడు హక్కుల విషయంలో ఎందుకు వెనకాలే ఉండాలని ప్రశ్నించారు. మహిళలకు డబ్బు, ఆర్థిక వ్యవహారాల గురించి తెలియాలన్నారు. మహిళలకు ఉద్యోగం ఉన్నా.. డబ్బు గురించి తెలియకపోతే వృథానే అని.. అదే ఉద్యోగం లేకపోయినా.. డబ్బును అర్థం చేసుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందని సూచించారు. లేకపోతే ఎప్పుడూ ఇతరులపైనే ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. రాజకీయాల్లోకి రాకపోతే ఏం చేసి ఉండేవారని అడిగిన ప్రశ్నకు తనకు అనేక రంగాల్లో ప్రవేశం ఉందని తెలిపారు. టీచర్‌గా పాఠాలు చెప్పగలనని.. వంట కూడా చేస్తానని చెప్పారు. అయితే చివరగా.. తాను గతంలో చేసిన ఓ ప్రసంగంలోని ‘ఖతమ్.. టాటా.. బైబై’ అనే మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని స్టూడెంట్స్ చెప్పగా.. ‘టాటా బైబై’ అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.