ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామకానికి సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫారసు చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసింది. జస్టిస్ ఎం. కిరణ్మయి, జస్టిస్ హరినాథ్, జస్టిస్ ఎన్.విజయ్, జస్టిస్ జె.సుమతిని హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసింది. ఈ నలుగురు న్యాయమూర్తులు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం పేర్కొంది. అయితే.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఈ నలుగురు న్యాయమూర్తులు.. గతంలో న్యాయవాదులుగా వ్యవహరించినట్లు కొలీజియం వివరించింది. ఈ న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలతో సంప్రదింపులు జరిపిన తర్వాతా.. ఈ ప్రతిపాదనలు పంపారు. అయితే.. ఈ ప్రతిపాదనలకు ఏపీ సీఎం జగన్మోహర్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. అనంతరం ఉన్నత న్యాయస్థానం కూడా ఈ నలుగురు న్యాయమూర్తులు నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయిన విషయం తెలిసిందే.