టీడీపీ నేత ఢిల్లీలో రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అక్రమమని.. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు టీడీపీ నేత కలిశెట్టి అప్పల నాయుడు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో తమ అభిప్రాయాలు తెలుపుతూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు సంతకాలు చేసిన లక్ష పోస్టు కార్డులను రాష్ట్రపతి కార్యాలయంలో అందజేశారు. అక్కడ కార్డుల్ని తీసుకున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి రశీదు కూడా ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలు ఈ పోస్ట్ కార్డు ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుతో పాటుగా రాష్ట్రపతికి లేఖలు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో కలిశెట్టి అప్పలనాయుడు కూడా పోస్ట్ కార్డుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఆ కార్డుల్ని తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్‌లో అందజేశారు. అంతేకాదు మరికొందరు కూడా రాష్ట్రపతికి లేఖల్ని రాశారు. దీంతో రాష్ట్రపతి భవన్‌కు పోస్ట్ కార్డుల వెల్లువ కొనసాగుతోంది.