సజ్జల తన నోటిదూల తీర్చుకోవడానికే విలేకరులతో మాట్లాడాడని, చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లడవుతున్న ఆందోళనను కప్పిపుచ్చడం కోసం మనిషనేవాడు మాట్లాడని విధంగా సజ్జల మాట్లాడాడని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ఇంటినుంచి తెప్పించుకునే భోజనంలో చంద్రబాబే ఏదో కలిపించుకొని ఉంటాడంటున్న సజ్జల.. గతంలో అలానే చేయమని జగన్ కు, అతని కుటుంబ సభ్యులకు చెప్పాడా? అని సూటిగా ప్రశ్నించారు. సజ్జల ప్రభుత్వ సలహాదారా... రాజమండ్రి జైలుకి సలహాదారా? అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి, ఆయన్ని ఎప్పటికీ ప్రజల్లోకి రాకుండా చేయాలన్నదే జగన్ కుట్ర అని సజ్జల వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోందని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. బాబాయ్ ని అధికారంకోసం అడ్డగోలుగా చంపించిన జగన్ దేనికైనా తెగిస్తాడని అన్నారు. చంద్రబాబులాంటి నాయకుడికి కనీస సౌకర్యాలుకూడా కల్పించరా? ఆఖరికి స్నానానికి వేడినీళ్లు, తాగడానికి మంచినీరు కూడా ఇవ్వరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.