ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం విషయంలో భారత్ మరోసారి దౌత్యనీతిని ప్రదర్శించింది. యుద్ధంలో మరింత రక్తపాతం జరుగుతుందనే భయాలు..ఇజ్రాయేల్ దళాలు గాజాపై దాడి చేయవచ్చనే నివేదికల మధ్య, భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలని కోరుతూనే ఉగ్రవాదంపై పోరాడాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. పాలస్తీనా సార్వభౌమ, స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందడాన్ని భారత్ సమర్థిస్తుందని తెలిపింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం పాలస్తీనాపై భారత్ వైఖరిని స్పష్టం చేశారు.
‘ఇజ్రాయేల్- పాలస్తీనా విషయంలో భారత్ వైఖరి చాలా కాలంగా స్పష్టంగా ఉంది.. ఇజ్రాయేల్‌తో శాంతియుతంగా చర్చలు జరిపి.. గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసిస్తూ.. సార్వభౌమాధికారం, పూర్తి స్వతంత్రతగా వ్యవహరించే పాలస్తీనా ఏర్పాటును భారత్ ఎల్లప్పుడూ సమర్థిస్తుంది.. ఇందుకోసం పాలస్తీనా, ఇజ్రాయేల్‌లు నేరుగా సంప్రదింపులు జరపాలని భారత్ ఆశిస్తోంది.. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యత ఉంది.. ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలతో పోరాడటంలో ప్రపంచ బాధ్యత కూడా ఉంది’ అని అన్నారు.
ఇజ్రాయేల్, గాజాలో మానవతా పరిస్థితులపై స్పందిస్తూ.. ఇరు వర్గాలు అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. ఇజ్రాయేల్‌కు భారత్ ఆయుధపరంగా సాయం అందిస్తోందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు .. ప్రస్తుతం అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపైనే దృష్టి సారించామని ఆయన తెలిపారు. ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు ఆపరేషన్ అజయ్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. తీవ్రవాద వ్యతిరేకత భారతదేశ విదేశాంగ విధానంలో అంతర్భాగమని ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిపిన సంభాషణల్లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సంఘర్షణలలో వర్తించే అంతర్జాతీయ మానవతా చట్టాలను అనుసరించి.. పోరాట యోధులు కానివారు, వైద్య సహాయక సిబ్బందిని వేరు చేయాలని భారత్ సూచించింది.
ఇజ్రాయేల్‌తో భారత్‌కు వ్యూహాత్మ, రక్షణ, భద్రత సంబంధాలు కొనసాగుతున్నా.. పాలస్తీనా సౌర్వభౌమత్యానికి మద్దతు ఇవ్వడం తమ విదేశాంగ విధానంలో అంతర్భాగమని ఉద్ఘాటించింది. ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించిన హమాస్‌ను భారత్ ఎలా చూస్తోందని అడిగిన ప్రశ్నకు.. ఇజ్రాయేల్‌పై ఆ గ్రూప్ చేసిన దాడి ఉగ్రవాద దాడి అని భారతదేశం చాలా స్పష్టంగా చెప్పిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాలస్తీనాకు అభివృద్ధి సహాయాన్ని అందజేస్తున్న భారత్.. ఆ దేశ శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితికి ఏడాదికి 5 మిలియన్ డాలర్ల విరాళాన్ని అందజేస్తుంది. గాజా ముట్టడిలో చిక్కుకున్న పాలస్తీనియన్లకు ఇంకా ఎటువంటి మానవతా సాయాన్ని ప్రకటించలేదు.