ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం రోజు రోజుకూ భీకరంగా మారుతోంది. తమపై హమాస్ ఉగ్రవాదులు చేసిన వైమానిక దాడులకు ఇజ్రాయెల్ గట్టిగా సమాధానం చెబుతోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్‌ను అన్ని వైపులా చుట్టుముట్టి.. నీరు, ఆహారం, కరెంట్ లేకుండా చేసిన ఇజ్రాయెల్.. దాడులను మరింత ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలోనే గాజా స్ట్రిప్‌లో ఉంటున్న పౌరులు.. 24 గంటల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో హమాస్ ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించి.. వారి ఆనవాళ్లను లేకుండా చేసేందుకే ఇజ్రాయెల్ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గాజా స్ట్రిప్‌లో గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టేందుకే ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏళ్లుగా చేస్తున్న యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఇక గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ల ఉనికి లేకుండా చేసేందుకు నిర్ణయించింది. ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు లేకుండా చేసే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులకు ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లోగా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితికి ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే గాజా స్ట్రిప్‌లో ఉన్న పౌరులు 24 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిణామాలు తీవ్ర మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతమందిని ఒకేసారి వెళ్లిపోవాలి అని ఆదేశాలు జారీ చేస్తే.. అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. గాజాలో స్కూళ్లు, క్లినిక్‌లు నడుపుతున్న ఐక్యరాజ్యసమితి కేంద్రాలు, సిబ్బంది కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది.
అయితే ఉత్తర గాజాలోని సొరంగాల్లో హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారని.. అందుకే వారిని పట్టుకునేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఉత్తర గాజాలో ఉన్న ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం తక్షణమే దక్షిణ ప్రాంతానికి తరలిపోవాలని సూచించినట్లు పేర్కొన్నాయి. ప్రజల్ని రక్షణగా వాడుకుంటూ హమాస్ మిలిటెంట్లు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాయి. రాబోయే రాజుల్లో గాజా నగరంలోని హమాస్ నెట్‌వర్క్‌పై ఇజ్రాయెల్ భద్రతా దళాలు దాడులు పెంచనున్నట్లు స్పష్టం చేసింది. అమాయక పౌరులకు ఎలాటి నష్టం కలగకూడదని తాము కోరుకుంటున్నామని.. అందుకే వెళ్లిపోమని ఆదేశాలు ఇచ్చినట్లు ఐడీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇజ్రాయెల్ దళాలు అనుసరిస్తున్న తీరు చూస్తుంటే గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గాజాలో క్షేత్రస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒకవేళ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తే గాజాలోని ప్రతి ఇంటికి వెళ్లి ఇజ్రాయెల్ భద్రతా బలగాలు హమాస్ ఉగ్రవాదులను వెతికి మరీ మట్టుబెడతాయి. అయితే గాజాలోని సొరంగాల్లో ఉన్న హమాస్ ఉగ్రవాదులను గుర్తించి చంపడం ఇజ్రాయెల్‌కు అతి పెద్ద సవాల్ కానుంది.