వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభించడంతో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. 2024 ఫిబ్రవరిలో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించే అవకాశం ఉంది. భారతీయ రైల్వే చరిత్రలో ఏ రైళ్లలోనూ లేనివిధంగా.. వందే భారత్ స్లీపర్ రైళ్లలోని ఫీచర్లు అద్భుతంగా ఉంటాయని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జీఎం బీజీ మాల్యా తెలిపారు. భారతీయ రైల్వేలో వరల్డ్ క్లాస్ ప్రయాణానికి ఇవి చిరునామా మారుతాయని మాల్యా తెలిపారు. ఐసీఎఫ్‌తో కలిసి ప్రభుత్వ రంగ సంస్థ బీఈఎంఎల్ తయారు చేస్తోన్న వందే భారత్ స్లీపర్ తొలి ప్రొటోటైప్‌కు సంబంధించిన కాన్సెప్ట్ ఫొటోలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల బయటపెట్టిన సంగతి తెలిసిందే.
వందే భారత్ స్లీపర్ రైళ్లలోని ఇంటీరియర్‌ను ఇప్పటి వరకూ మన దేశంలో ఏ రైళ్లలోనూ చూడలేదని మాల్యా తెలిపారు. రైలు బోగీలోకి అడుగుపెట్టగానే వావ్ అని అనిపించేలా ఇంటీరియర్ ఉంటుందన్నారు. వందే భారత్ స్లీపర్ రైలు లోపల వాతావరణం (ఆంబియెన్స్) ఎక్సలెంట్‌గా ఉంటుందని.. ప్రయాణికుల అనుకూలమైన ఫీచర్లు ఉంటాయన్నారు. వందే భారత్ స్లీపర్ కొత్త రైళ్లలో 16 కోచ్‌లు ఉంటాయని.. అందులో 11 ఏసీ-3 టైర్ కాగా.. 4 ఏసీ-2 టైర్, ఒకటి ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటుందన్నారు. ‘‘వందే భారత్ రైళ్లలో ఉన్నట్టుగానే ఏసీ, ఆటోమెటిక్ డోర్లు, ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, వాక్యూమ్ టాయిలెట్లు.. ఇలా అన్ని ఫీచర్లు స్లీపర్ రైళ్లలో ఉంటాయి. లోపలి వాతావరణం ఎంతో బాగుంటుంది. సాఫ్ట్ లైటింగ్, అప్పర్ బెర్త్‌లకు ఎక్కేందుకు ప్రయాణికులకు అనువైన నిచ్చెన ఈ రైళ్లలో ఉంటుందని ఐసీఎఫ్ జీఎం తెలిపారు.
ఐసీఎఫ్‌తో కలిసి బీఈఎంఎల్ పది వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయనుంది. డిజైనింగ్‌ను ఐసీఎఫ్, బీఈఎంఎల్ కలిసి చేశాయని మాల్యా తెలిపారు. ఈ రైళ్లకు ప్రొపల్షన్‌ను ఐసీఎఫ్ సరఫరా చేస్తుండగా.. బీఈఎంఎల్ దాన్ని అసెంబ్లింగ్ చేయనుంది. టిటాగఢ్-బీహెచ్ఈఎల్ కన్సార్టియం ఐసీఎఫ్‌లో 80 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయనుండగా.. ఆర్వీఎన్‌ఎల్-టీఎంహెచ్ 120 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసే కాంట్రాక్టును దక్కించుకుంది.