భార్యని చంపిన భర్త కేసుని పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్ళితే.... అనంతపురం జిల్లా, రాయదుర్గం పరిధిలోని కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన మాదుల వన్నూరుస్వామి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. భార్య చిట్టెమ్మ(44) భర్త ప్రవర్తనపై నిలదీస్తూ వచ్చేది. దీంతో ఇరువురి మధ్యలో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 12న భార్య భర్తలిద్దరూ గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన వన్నూరు స్వామి భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బంధువులందరికీ అనారోగ్యంతో తన భార్య చనిపోయిందని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే వీరి కుమారు డు సోమశేఖర్ తాను గ్రామంలో లేనప్పుడు తనకు తెలియకుండా అంత్యక్రియలు ఎలా చేశారని తండ్రిని నిలదీశాడు. అనంతరం అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పూడ్చిన శవాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె మృతి చెందినట్లు తేలింది. దీంతో ఈ కేసును హత్యకేసుగా మార్చి సీఐ యుగంధర్ నేతృత్వంలో విచారించారు. భర్త వన్నూరు స్వామిని శుక్రవారం సాయంత్రం సొల్లాపురం గ్రామంలో అరెస్టు చేశారు. తలపై కొట్టడంతోనే తన భార్య చనిపోయిందని నిందితుడు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.