మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలోని ఆయన స్మారక మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. కలాంకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘చంద్రయాన్-3 వ్యోమనౌకను రూపొందించిన తర్వాత అమెరికా నుంచి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) నిపుణులను ఇక్కడకు ఆహ్వానించాం. చంద్రయాన్-3 గురించి వివరించాం. చంద్రయాన్-3లో మనం వినియోగించిన శాస్త్రీయ పరికరాలను చూసిన నాసా నిపుణులు.. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉన్న పరికరాలను వాడారని కొనియాడారు. దీన్ని ఎలా రూపొందించారు..? ఈ టెక్నాలజీని మీరు అమెరికాకు ఎందుకు అమ్మకూడదు..? అని అడిగారు’’ అని సోమనాథ్ తెలిపారు.