మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో బుధ్నీ నియోజకవర్గంలో పోటీకి ప్రముఖ నటుడు విక్రమ్ మాస్తాల్‌ను నిలిపింది. మాస్తాల్ 2008 నాటి ఆనంద్ సాగర్ టీవీ సీరియల్ ‘రామాయణ’లో హనుమంతుడి పాత్ర పోషించి గుర్తింపు పొందారు. ఆయన జూలైలో కాంగ్రె్‌సలో చేరారు. ఈ జాబితాలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్‌నాథ్ (ఛింద్వాడా), మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ తనయుడు జయవర్ధన్ సింగ్ (రాఘోగఢ్), తమ్ముడు లక్ష్మణ్ సింగ్ (చాచౌడా)తో పాటు పలువురు సీనియర్ల పేర్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ తొలి జాబితాలో 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఓబీసీలకు 39, ఎస్సీలకు 22, ఎస్టీలకు 30, మైనారిటీలకు 6, మహిళలకు 19 టికెట్లు ఇచ్చారు. ఇక ఛత్తీ్‌సగఢ్‌లో 30మందితో తొలి జాబితా ప్రకటించింది. సీఎం బాఘెల్ ఎప్పటిలా తన పాటన్ నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ 30 నియోజకవర్గాల్లో 14ఎస్టీ, 3ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు. మిగతా 13జనరల్ స్థానాల్లో 9ఓబీసీలకు కేటాయించింది.