ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌ఐఆర్ విషయంలో ఈసీ, మమతా మధ్య వివాదం.. సుప్రీంకోర్టు అసాధారణ ఉత్తర్వులు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 07:15 PM

పశ్చిమ్ బెంగాల్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ మధ్య కొనసాగుతోన్న వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో సహకారం అందించేందుకు జ్యుడీషియల్ అదికారులను నియమించాలని కలకత్తా హైకోర్టును సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. జ్యుడీషియల్ అధికారులు వాదనలు, అభ్యంతరాలను పరిశీలించవచ్చని పేర్కొంది.


‘‘రెండు రాజ్యాంగ వ్యవస్థలైన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో దురదృష్టకర పరిస్థితి నెలకుంది. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ తార్కిక వ్యత్యాసాల జాబితాలో ఉన్నవారి వాదనలు, అభ్యంతరాల దశలోనే నిలిచిపోయింది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. SIR కోసం ప్రస్తుతం పనిచేస్తున్న, మాజీ జిల్లా న్యాయమూర్తి హోదాలో ఉన్న జ్యుడీషియల్ అధికారులను కూడా నియమించాలని స్పష్టం చేసింది. ‘‘అసాధారణ పరిస్థితుల కారణంగా అసాధారణ ఉత్తర్వులు’’ జారీ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.


ఎస్ఐఆర్ ప్రకియలో జ్యుడీషియల్ అధికారులు పాల్గొనే ప్లాన్‌పై చర్చించడానికి హైకోర్టు న్యాయమూర్తితో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు శనివారం సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ‘‘ SDO, SDM విధులు నిర్వర్తించే గ్రూప్-ఏ అధికారులను కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్రం ప్రభుత్వంపై ఉంది. ERO, AERO స్థాయి అధికారుల హోదా విషయంలో ప్రభుత్వం, ఈసీ మధ్య వివాదం నెలకుంది.. రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి కేటాయించిన అధికారుల హోదా, ర్యాంక్‌ను ఈ కోర్టు నిర్ణయించడం దాదాపు అసాధ్యం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.


అయితే, ఈసీ వర్గాల ప్రకారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తరుచూ తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో ఈసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు సంయమనంతో వ్యవహరించినా ఆమె ఆవేశంతో ఊగిపోయారని పేర్కొన్నారు. పశ్చిమ్ బెంగాల్‌లో మరికొద్ది వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ సహా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అయితే, ఎస్ఐఆర్ పేరుతో అసలైన ఓటర్లను తొలగించేందుకు ఈసీతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న అసోంలో ఎందుకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టలేదని ఆమె నిలదీస్తున్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్‌లో కేంద్ర ఎన్నికల కమిషన్ అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆమె దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎస్ఐఆర్ విషయంలో ఏదైనా ఆదేశాలు ఉంటే తామే ఇస్తామని గతవారం నాటి విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa