ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎంకే‌కు జయలలిత వీరవిధేయుడి సపోర్ట్..,,. సీఎం స్టాలిన్‌తో పన్నీరు సెల్వం భేటీ

national |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 07:18 PM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. తమిళనాట రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే బృహిష్కృత నేత, మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. దివంగత విజయ్‌కాంత్ ఏర్పాటు చేసిన డీఎండీకే గురువారమే స్టాలిన్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమిలో చేరింది. ఇది జరిగిన మర్నాడే స్టాలిన్‌ను పన్నీరు సెల్వం కలవడం చెప్పుకోదగ్గ పరిణామం.


శుక్రవారం అసెంబ్లీ ముగిసిన తర్వాత స్టాలిన్, ఓపీఎస్ సమావేశం జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఓపీఎస్.. అసెంబ్లీ ప్రాంగణంలో స్టాలిన్‌తో చర్చలు జరిపారు. అయితే, వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయమై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఈ భేటీ తమిళ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల పంపకాలపై ముమ్మర చర్చలు జరుగుతోన్న తరుణంలో డీఎంకే చీఫ్‌ను ఓపీఎస్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


స్టాలిన్‌ను పన్నీరుసెల్వం కలవడానికి ముందు.. ఆయన మద్దతుదారు, ఉసిలంపట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐదేళ్ల స్టాలిన్ పాలనపై ప్రశంసలు గుప్పించారు. డీఎంకే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో డీఎంకే గెలుస్తుందని, స్టాలిన్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. దీంతో పన్నీరుసెల్వం డీఎంకే గూటికి చేరతారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.


వాస్తవానికి గతేడాది ఆగస్టులోనే ఎంకే స్టాలిన్‌ను మార్నింగ్‌ వాక్‌లో పన్నీరు సెల్వం కలుసుకున్నారు. అనంతరం ఆయన ఎన్డీయే నుంచి బయటకొచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చోళపురం పర్యటన సమయంలో ఆయన్ను కలిసేందుకు ఓపీఎస్ అపాయింట్‌మెంట్ కోరగా.. అటు నుంచి సానుకూల స్పందన రాలేదు. అన్నాడీఎంకే ర్యాలీలకు సైతం పన్నీరు సెల్వానికి ఆహ్వానం లభించలేదు. మోదీతోపాటు అమిత్ షాను కలవడానికి ఓపీఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


ఈ పరిణామాలతో ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన పన్నీర్‌సెల్వం .. సర్వశిక్షాభియాన్ నిధులను కేంద్రం నిలిపివేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పట్లోనే ఆయన డీఎంకే వెంట నడుస్తారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే.. పన్నీర్‌సెల్వం ఇప్పుడు అడుగులేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. జయలలితకు వీర విధేయుడైన పన్నీర్‌సెల్వం ఆమె బతికి ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. ఆమె జైలుకు వెళ్లినప్పుడు సీఎం పదవిలో ఓపీఎస్‌నే కూర్చోబెట్టారు. 2016లో అమ్మ మరణానికి ముందు అనారోగ్యానికి గురైనప్పుడు కూడా పన్నీర్‌సెల్వం పగ్గాలు చేపట్టారు. కానీ, జయ మరణం తర్వాత అన్నాడీఎంకేపై పట్టు సాధించిన పళనిసామి.. శశికళ మద్దతుతో సీఎం అయ్యారు. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa