ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 19 అడుగుల విగ్రహాన్ని అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘జై భీమ్’ నినాదాలు మార్మోగాయి. భారీ వర్షం కురుస్తున్నా అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మందికిపైగా భారతీయ అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి సుమారు పది గంటలకుపైగా ప్రయాణించి వచ్చామని పలువురు పేర్కొన్నారు. దీన్ని సమానత్వ విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ)గా అభివర్ణించారు. భారతదేశం బయట ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాలలో ఇదే అతి పెద్దది. ప్రముఖ శిల్పి రామ్ సుతార్ దీన్ని రూపొందించారు. గుజరాత్‌లో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ ‘ఐక్యతా విగ్రహం’ను కూడా ఈయనే రూపొందించారు.