ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమైన గమనిక. మార్చి 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ఏపీలోని పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ తరగతులు నిర్వహిస్తారు. 12 గంటల 30 నిమిషాలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. మరోవైపు ఇదే సమయంలో ఏపీలో పదో తరగతి పరీక్షలు కూడా జరగనున్న సంగతి తెలిసిందే. పదవ తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు జరుగుతాయి. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాలలో క్రమంగా పెరుగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్కబోతలు, ఎండవేడిమి కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఏటా ఒంటి పూట బడులు(Morning Schools) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి కూడా మార్చి 16వ తేదీ నుంచి మార్నింగ్ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒంటిపూట బడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోనూ మార్చి 16వ తేదీ నుంచే ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో పదవ తరగతి పరీక్షలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు కూడా మార్చి 16 నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకూ పరీక్షలు జరగనున్నాయి.
ఏపీ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ 2026
మార్చి 16 - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 21 - ఇంగ్లీష్
మార్చి 23 - గణితం
మార్చి 25 - భౌతిక శాస్త్రం
మార్చి 28 - బయాలజీ
మార్చి 30 - సాంఘిక శాస్త్రం
మార్చి 31 - ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్
ఏప్రిల్ 1 - ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ -2
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa