ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెత్తతో పాటు రూ.15 లక్షల నగలు అమ్మేసిన వ్యక్తి.. 4 నెలల తర్వాత తిరిగిచ్చిన స్క్రాప్ డీలర్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 07:27 PM

రూపాయి బిళ్ల దొరికితేనే జేబులో వేసుకుని చప్పుడు కాకుండా వెళ్లిపోయే మనుషులున్న ప్రస్తుత కాలంలో.. ఏకంగా రూ.15 లక్షల విలువైన బంగారాన్ని చూసి కూడా ఏమాత్రం ఆశ పడలేదో వ్యక్తి. ముఖ్యంగా తనకు ఓ యజమాని అమ్మిన చెత్తలో వచ్చిన బంగారు నగల సంచిని.. నాలుగు నెలల తర్వాత గుర్తించాడు. దాచుకుంటే ఎవరికీ తెలిసే అవకాశమే లేకపోయినా.. అతడు మాత్రం నిజాయితీగా ఓ నగల యజమానిని గుర్తించి మరీ దాన్ని అతడికి అప్పగించాడు. నగలు ఏమయ్యాయో తెలియక లబోదిబోమంటూ గుండెలు బాదుకున్న ఆ కుటుంబ సభ్యులు మాత్రం.. స్క్రాప్ డీలర్ నిజాయితీని చూసి తెగ సంబురపడిపోయారు.


అసలేం జరిగిందంటే..?


హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన అశోక్ శర్మ అనే వ్యక్తి గతేడాది అక్టోబర్‌లో దీపావళి పండుగ సందర్భంగా తన ఇంటిని శుభ్రం చేయించారు. ఈ క్రమంలోనే ఇంట్లోని పాత సామాన్లు, పనికిరాని వస్తువులను ఏరి.. స్థానిక స్క్రాప్ డీలర్ అక్తర్ ఖాన్‌కు విక్రయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ పాత సామాన్ల సంచిలోనే రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న కవర్ కూడా ఉంది. ఇంటి శుభ్రత ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు.. పొరబాటున ఆ విలువైన నగలను కూడా చెత్తతో పాటే స్క్రాప్ డీలర్‌కు అమ్మేశారు.


నాలుగు నెలల నిరీక్షణ.. ఎవరూ ఊహించని మలుపు!


అయితే కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నగలు కనిపించకపోవడంతో అశోక్ శర్మ కుటుంబం కంగారు పడింది. అన్నీ వెతికాక.. అవి స్క్రాప్ డీలర్‌కు ఇచ్చిన చెత్తలో పోయాయని గ్రహించి అక్తర్ ఖాన్‌ను సంప్రదించారు. దీంతో అక్తర్ ఖాన్ కూడా విపరీతంగా వెతికాడు. కుటుంబ సభ్యుల ముందే తుక్కును మొత్తం తీసి చూడగా.. ఎక్కడా కనిపించలేవు. దీంతో నగలపై ఆశ వదులుకున్న అశోక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ నెలలు గడిచాక ఓ అద్భుతం జరిగింది. ఇటీవల అక్తర్ ఖాన్ తన వద్ద ఉన్న భారీ చెత్త నిల్వలను వేరు చేస్తున్న సమయంలో ఒక ప్లాస్టిక్ కవర్‌ను గుర్తించాడు. దాన్ని విప్పి చూడగా అందులో మెరిసిపోతున్న బంగారు ఆభరణాలు కనిపించాయి. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ నగలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు అక్తర్.


పోలీసుల ప్రశంసలు..


అప్పటికే నమోదైన కేసు ఆధారంగా పోలీసులు అశోక్ శర్మ కుటుంబాన్ని స్టేషన్‌కు పిలిపించారు. అక్తర్ ఖాన్ చేతుల మీదుగానే ఆ బంగారు ఆభరణాలను యజమానికి అందజేశారు. కష్టపడి సంపాదించుకున్న నగలు మళ్లీ దొరకడంతో అశోక్ శర్మ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా అక్తర్ ఖాన్‌ను కౌగిలించుకుని మరీ అశోక్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కాలంలో ఇంతటి నిజాయతీ పరుడిని చూడటం గొప్ప విషయమని పోలీసులు అక్తర్ ఖాన్‌ను సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa