ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మా బంధువులు కర్ణాటకలో ఎస్టీలు.. మేం మాత్రం ఏపీలో బీసీలం’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 06:18 PM

కర్ణాటకలో ఎస్టీలు.. ఏపీలో బీసీలుగానా అంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రశ్నించారు. రాష్ట్రంలో వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని కోరారు. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం వాల్మీకి బోయల్ని ఎస్టీల్లో చేర్చే అంశంపై కేంద్రానికి సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ఈ విషయమై రాష్ట్రం నుంచి కేంద్రం ఆరు అంశాల్లో వివరణ కోరిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారని కూడా ఎమ్మెల్యే తెలిపారు.


గత ప్రభుత్వం వాల్మీకి బోయల్ని ఎస్టీల్లో చేర్చే అంశాన్ని రాయలసీమకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రాన్ని కోరిందని కాలవ శ్రీనివాసులు చెప్పారు. అయితే కేంద్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించిందన్నారు. వాల్మీకి బోయల్ని ఎస్టీల్లో చేర్చాలని.. ఎన్ని కమిషన్లు సిఫారసు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రంలోని నేషనల్‌ సెన్సస్‌ కమిషన్‌ తిరస్కరిస్తోందన్నారు కాలువ శ్రీనివాసులు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత.. కొందరు వాల్మీకి బోయలు కర్ణాటకలోకి, మరికొందరు వాల్మీకి బోయలు ఏపీలోకి వచ్చారని కాలవ శ్రీనివాసులు తెలిపారు. బళ్లారిలో ఉన్న తమ బంధువులు ఎస్టీ జాబితాలో ఉంటే.. ఏపీలో తాము మాత్రం బీసీ-ఏలుగా మిగిలిపోయామని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రయత్నాలు చేశానన్నారు. ఢిల్లీలోని కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి పరిస్థితిని వివరించానన్నారు. కానీ ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేయాలని.. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకి బోయలు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ వీరి జనాభా ఎక్కువగా ఉంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వాల్మీకి బోయలు ఉన్నారు. అలాగే గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వీరు ఉన్నారు. 15కుపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. అనంతపురం లోక్ సభ స్థానం పరిధిలో 2 లక్షల మందికిపైగా ఈ సామాజికవర్గ ఓటర్లు ఉన్నారని అంచనా.


విశాఖ మన్యం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే బోయలను ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. కానీ రాయలసీమ లాంటి మైదాన ప్రాంతాల్లో ఉండే వాల్మీకి బోయలను మాత్రం బీసీ-ఏ జాబితాలోనే ఉంచారు. దీంతో కర్ణాటక తరహాలోనే తమను ఇక్కడ కూడా ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa