ఉపాధ్యాయుడి మాయ మాటలకు పడిపోయిన ఓ విద్యార్థిని గర్భం దాల్చింది. ఆ విషయం తెలియక వ్యవహారం బిడ్డ పుట్టేదాకా వెళ్లింది. శ్రీసత్యసాయి జిల్లా, తనకల్లులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పదవతరగతిలోనే బాలిక గర్భం దాల్చిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... తనకల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (మెయిన) పదో తరగతి చదువుతున్న సమయంలో ఆ విద్యార్థినిని అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య లొంగదీసుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఈనెల 14న కడుపు నొప్పిగా ఉండటంతో తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి బాలికను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి, పురిటి నొప్పులని గుర్తించారు. బాలికకు పురుడు పోశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు తమకొచ్చిన కష్టాన్ని అక్కడి వైద్యులకు వివరించారు. ఈ విషయాన్ని వైద్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కదిరి డీఎస్పీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.