చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నిజాలను పాతాళంలోకి తొక్కేశారని, ఇప్పుడు నిజం గెలుస్తున్నందునే చంద్రబాబు జైల్లో ఉన్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిజం గెలవాలని కోరుకునేవారు 17A పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. నిజాన్ని ఓడించాలనే టీడీపీ ప్రయత్నం ఓడిపోతూనే ఉందని స్పష్టం చేశారు.చంద్రబాబు సతీమణి భువనేశ్వరి `నిజం గెలవాలి` పేరుతో యాత్ర చేయబోతున్నట్లు.. వారి కుమారుడు లోకేశ్ యువగళం యాత్ర ఆపేసి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారనే ప్రకటనలు చేశారని, ఈ సందర్భంలో కొన్ని నిజాల్ని రాష్ట్ర ప్రజలతో పంచుకోవాల్సి ఉందని, నిజం గెలవాల్సిందేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.