నంద్యాల జిల్లాలో మైనింగ్ వ్యాపారి కిడ్నాప్ మిస్టరీ వీడింది. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బనగానపల్లికి చెందిన వినాయకరెడ్డి దగ్గర అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం రామరాజుపల్లెకు చెందిన గోగుల నరేష్ గతంలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేయడంతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా చూసుకునేవాడు. అక్కడ పని మానేసి వెళ్లిపోయిన నరేష్ జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. తన అప్పులు తీరాలంటే వినాయకరెడ్డిని కిడ్నాప్ చేయాలని కుట్రపన్నాడు. తనకు పరిచయం ఉన్న శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన చెన్నా భాస్కర్, పుట్టపర్తి ఎస్సీ కాలనీకి చెందిన పుట్టపర్తి రఘులకు ఈ విషయం చెప్పాడు.
ఆయన్ను కిడ్నాప్ చేస్తే ఒకేసారి రూ.కోట్లు సంపాదించి స్థిరపడవచ్చని ఆశ పెట్టాడు. వీరు కర్ణాటకకు చెందిన ఓ ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించాలని ప్లాన్ చేశారు. వ్యాపారి రాకపోకలపై రెక్ చేసి.. వినాయకరెడ్డి కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డితో కలిసి జూన్ 5న బనగానపల్లి నుంచి బేతంచెర్ల వైపు కారులో వెళుతుండగా ఈ గ్యాంగ్ వెంబడించింది. బేతంచెర్ల మండలం సీతారామాపురం మెట్ట దాటగానే కారును అడ్డగించి వారిని కత్తితో బెదిరించారు. తండ్రీకుమారుడితో పాటు అడ్డొచ్చిన డ్రైవర్ సాయినాథ్‌రెడ్డిని కూడా కిడ్నాప్ చేశారు.
తాము అడిగినంత నగదు ఇస్తేనే విడిచిపెడతామని కిడ్నాప్ గ్యాంగ్ బెదిరించింది. ఈ క్రమంలో వ్యాపారి కుటుంబ సభ్యుడైన శంకర్‌రెడ్డి ద్వారా రెండు విడతలుగా రూ.4 కోట్లు వారికి అందజేశారు. అయితే వినాయకరెడ్డి తండ్రి సీహెచ్ నాగిరెడ్డి బేతంచెర్ల పోలీసులకు జూన్ 7న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూన్ 29వ తేదీన 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40 లక్షలు నగదును, నాలుగు కార్లు, మొబైల్స్, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఏ1, ఏ2, ఏ4 నిందితులైన గోగుల నరేష్, చెన్నా భాస్కర్, పుట్టపర్తి రఘు పరారీలో ఉండటంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ ముగ్గుర్ని కూడా అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సమీపంలోని టోల్‌గేటు దగ్గర్లోఅరెస్టు చేసి వారి దగ్గరున్న రూ.2.66 కోట్ల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేసి.. రూ.3.06 కోట్లు రికవరీ చేసినట్లు చెప్పారు. గతంలో తనకు ఉద్యోగం ఇచ్చిన వ్యాపారినే కిడ్నాప్ చేసి అడ్డంగా దొరికిపోయాడు నరేష్.. జల్సాలల కోసం డబ్బులకు ఆశపడి ఇప్పుడు జైలు పాలయ్యాడు.