ఏపీ కేబినెట్ ఈ నెల 31న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే ప్రతిపాదనలు ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా సాధారణ పరిపాలన (కేబినెట్) విభాగానికి పంపాల్సి ఉంటుందని అన్ని శాఖల ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు. గత నెల అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం విశాఖకు మారనుండడంపై చర్చించగా.. దసరాకు ముఖ్యమంత్రి విశాఖకు మారిపోతున్నారంటూ ఆ సమావేశానంతరం ఒకరిద్దరు మంత్రులు ప్రభుత్వ పెద్దలు చెప్పారు. వచ్చే డిసెంబరులోగా తాను విశాఖకు వస్తానని తాజాగా ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనలో కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలో 31న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.