టీడీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటూ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు, ఇంఛార్జ్‌లు, కమిటీల్లో నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నేతలు సమావేశంలో పాల్గొన్నారు. జనసేన సమన్వయంతో తెలుగుదేశం శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయటమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ‘నిజం గెలవాలి’ పేరిట నారా భువనేశ్వరి యాత్ర, చంద్రబాబు అరెస్టుతో ఆగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం, బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపుపై కీలక చర్చ జరగనుంది. ఓటర్ వెరిఫికేషన్, పార్టీ సంస్థాగత నిర్మాణం అంశాలపైనా చర్చించనున్నారు.
అధినేత చంద్రబాబు లేకుండా తొలిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే సమావేశంలో ఆసక్తికర సీన్ కనిపించింది. సమావేశం జరుగుతున్న వేదికపై చంద్రబాబు కూర్చొనే కుర్చీని ఖాళీగా వదిలేశారు. నారా లోకేష్ ఓ వైపు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోవైపు కూర్చున్నారు. ఈ సమావేశంలో నేతలతో కీలక అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. నారా లోకేష్ పుంగనూరులో టీడీపీ కార్యకర్తల్ని వైసీపీ నేత దౌర్జన్యం చేయడంపై స్పందించారు. 'సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుండి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల పై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అధికారం ఇచ్చింది టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్? వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డు పై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు' అంటూ ట్వీట్ చేశారు.