కర్నూలు జిల్లా, దేవరగట్టు పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇష్టదైవమైన మాళ మల్లేశ్వరులకు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులతో కొండ దిగువన సింహాసన కట్టవద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వివిధ గ్రామాల భక్తులు దేవుడి కోసం సై అనడంతో బన్ని కర్రల సమరం మొదలైంది. తలలపై ఇనుప రింగులు చుట్టిన పట్టుడు కర్రలు నాట్యమాడాయి. అరగంటకు పైగా సాగిన జైత్రయాత్రలో పదుల సంఖ్యలో భక్తుల తలలు పగిలి రక్తం చిందాయి. చూసే వారికి ఇది ఆటవిక చర్య అనిపించినా.. ఆ గ్రామాల భక్తులకు అత్యంత పవిత్రమైన ఉత్సవం.. మంగళవారం అర్ధరాత్రి దేవరగట్టు వేదికగా సాగిన కర్రల సమరంలోని సంబరం ఇది. జిల్లాలో దేవరగట్టు బన్ని జైత్రయాత్రను చెడుపై మంచి సాధించిన విజయోత్సవ సంబరాలుగా మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలూరు పట్టణానికి 15 కి.మీల దూరంలో హొళగుంద మండలం దేవరగట్టు శ్రీమాళమల్లేశ్వరస్వామి క్షేత్రంలో బన్ని ఉద్రిక్తంగా.. ఉత్కంఠంగా సాగింది. కర్రలు లేకుండా ఉత్సవం జరిపించాలని ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కలెక్టరు జి.సృజన, ఎస్పీ జి. కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టరు అభిషేక్‌కుమార్, పత్తికొండ ఆర్డీఓ మోహన్‌దాస్ నేతృత్వంతో నెల రోజులుగా పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా కొండపై కర్రలదే పైచేయి అయ్యింది. బన్ని జైత్రయాత్ర కర్రల యుద్ధాన్ని తలపించింది.